: అమరావతి నుంచి గుంటూరుకు 'మెము' రైళ్లు... అధ్యయనం చేయాలని రైల్వే శాఖకు ఆదేశం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు తాత్కాలికంగా 'మెము' (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్- రెండు దగ్గరి ప్రదేశాల మధ్య షటిల్ సర్వీస్) రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం రైళ్లను నడిపేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర రైల్వే శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పట్లో మెట్రో రైళ్లు నడపడం సాధ్యం కాని పని. అందుకే ప్రత్యామ్నాయంగా ఈ మెము రైళ్లపై దృష్టి పెట్టింది. దాంతో రాజధాని ప్రాంతానికి గుంటూరు నుంచి రాకపోకలు సులభతరం అవనున్నాయి. ఈ నేపధ్యంలో నంబూరు రైల్వేస్టేషన్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలు మార్గం నిర్మించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఈ విషయంపై శ్రద్ధ చూపుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చర్చలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జనసాంద్రత పెరిగేంత వరకు మెము రైళ్లను నడపడమే సరైందని భావిస్తున్న కేంద్రం, దాదాపు 16 కోచ్ లతో మొము రైలుని నడపవచ్చని సమాచారం. ఒక్కో కోచ్ లో 70 మంది కూర్చునే వీలుంటుందట. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరిస్తే నూతన రైలు మార్గాన్ని కొన్ని నెలల్లోనే నిర్మిస్తామని ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన సమయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.