: చైనా కష్టాలతో అతి ఎక్కువగా భయపడుతున్న భారత నగరమిదే!


చైనాలో నెలకొన్న మాంద్యం, ఆర్థిక కష్టాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి ముంచగా, ఓ భారత నగరం మరింతగా భయపడుతోంది. అదే ప్రపంచంలోనే 80 శాతం వజ్రాలను సానబట్టే పరిశ్రమలు ఉన్న సూరత్. వజ్రాభరణాల మార్కెట్ కు పెద్దన్నగా ఉన్న చైనాలో ప్రజలు లగ్జరీ కొనుగోళ్లు మరచిపోవడం, ఆభరణాలు, వజ్రాలు అమ్ముడు కాకపోవడంతో సూరత్ లో పరిశ్రమ స్తంభించింది. దీంతో రెండు నెలల వ్యవధిలో సూరత్ లో సుమారు 5 వేల మంది వజ్రాలను పాలిష్ చేసే నిపుణులు ఉపాధిని కోల్పోయారు. చైనా నుంచి రావాల్సిన వందల కోట్ల విలువైన ఆర్డర్లు రాలేదని వ్యాపారులు చెబుతున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితి వేరు. తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ఫియట్ కార్లు, అపార్టుమెంట్లు, బంగారు ఆభరణాలు ఇచ్చి ప్రోత్సహించిన డైమండ్ కంపెనీలు, నేడు వారిని విధుల్లోంచి తొలగించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే డజనుకు పైగా పెద్ద డైమండ్ కంపెనీల్లో పని ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది వజ్రాభరణాల రంగంలో ఉపాధిని పొందుతుండగా, వారిలో 6.5 లక్షల మంది సూరత్ లోనే ఉన్నారు. సుమారు 25 సంవత్సరాలుగా వజ్రాలకు సానబెట్టే పనిలో ఉపాధిని పొందుతూ, ముడి వజ్రాలను తెల్లని ట్యూబ్ లైట్ల కాంతుల కింద మరింత ఆకర్షణీయంగా మార్చే సునీల్ కుమార్ రాజ్ పుత్ ఉద్యోగం గత జూన్ నెలలో పోయింది. తిరిగి తాము చెప్పేవరకూ విధుల్లోకి రానవసరం లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. "ప్రస్తుతం ఇస్తున్న వేతనంలో సగమిచ్చినా పనిచేసేందుకు నేను సిద్ధం. కానీ అసలు పని ఉంటేగా?" అని అంటున్నాడు 45 ఏళ్ల రాజ్ పుత్. ఖర్చులను తగ్గించుకునేందుకు యూపీలోని సొంతింటికి పిల్లలను పంపించి వేసినట్టు ఆయన వాపోయాడు. "వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే పని చేస్తున్నాం. జూన్ నుంచి వేతనం రావాల్సి వుంది. ఇల్లు గడవడం కష్టమవుతోంది" అని హీరేన్ పటేల్ (35) వ్యాఖ్యానించాడు. పాలిష్ చేసిన డైమండ్ మార్కెట్ లో 20 శాతం చైనా నుంచే వస్తోంది. యూఎస్ లో వజ్రాలకు ఉన్న డిమాండుతో పోలిస్తే ఇది రెట్టింపు. 2008 నుంచి 2013 మధ్య చైనాలో సాలీనా 18 శాతం వృద్ధితో వజ్రాల అమ్మకాలు పెరిగాయి. దీంతో అంతే స్థాయిలో సూరత్ కంపెనీలకూ వ్యాపారవృద్ధి నమోదైంది. ఆ తరువాత చైనాలో వచ్చిన మార్పులు ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్నాయని జెమ్ అండ్ జ్యూయెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అంచనా వేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈయేడు వజ్రాభరణాల వ్యాపారం 50 శాతం తగ్గిందని తెలిపారు.

  • Loading...

More Telugu News