: ఆసుపత్రిలో ‘బన్నీ’ ఫ్యామిలీ... అల్లు అర్జున్ కు గాయాలేమీ కాలేదన్న అరవింద్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ కు తీవ్ర గాయాలయ్యాయని, ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కుటుంబం మొత్తం సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రికి చేరిందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. అసలు బన్నీకి చికిత్స కోసం తాము ఆసుపత్రికి రాలేదని ఆయన తెలిపారు. బన్నీ భార్య స్నేహలతారెడ్డికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించేందుకే తాము ఆసుపత్రికి వచ్చామని ఆయన పేర్కొన్నారు. బన్నీకి గాయాలైనట్లు వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. అసలు బన్నీకి చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా లేదని ఆయన చెప్పారు. గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో స్నేహలతారెడ్డి గాయపడ్డారని, ఆ క్రమంలోనే ఆమెకు ఆపరేషన్ చేయించేందుకు వచ్చామని ఆయన తెలిపారు. నేటి సాయంత్రంలోగా స్నేహలతారెడ్డికి ఆపరేషన్ పూర్తికానుందని, వెంటనే డిశ్చార్జీ కూడా చేయనున్నట్లు అరవింద్ వివరించారు.