: ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యానికి రూ.55వేల జరిమానా


ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యానికి తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల ఫోరం రూ.55వేల జరిమానా విధించింది. ఏడు సంవత్సరాల కిందట ఓ ప్రయాణికుడి వస్తువుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అతడిని మనోవేదనకు గురి చేసిందునందుకుగానూ ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తమిళనాడుకు చెందిన అశోక్ బాలసుబ్రమణియన్ అనే వ్యక్తి 2008, ఆగస్టు 3న జోహెన్నస్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నైకు వస్తూ కనెక్టింగ్ విమానం ఎక్కాడు. చెన్నైకు చేరుకున్నాక తన లగేజీ పోయిందని తెలిసి వెంటనే ఎమిరేట్స్ అధికారులకు తెలిపాడు. అందుకు పరిహారంగా 200 డాలర్లు ఇస్తామని ఈ ఏడాది ఆగస్టు 28న అశోక్ కు ఎయిర్ లైన్స్ లేఖ రాసింది. దాంతో అతడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఎమిరేట్స్ నిర్లక్ష్యంతో తన కెరీర్ కు నష్టం జరిగిందని, పైలెట్ లైసెన్స్, సర్టిఫకెట్లతో పాటు కీలక పత్రాలు పోయాయని తెలిపాడు. ఇందుకు పరిహారంగా తనకు రూ.50 లక్షలు ఇప్పించాలని ఫోరంను కోరాడు. కానీ ఎమిరేట్స్ మాత్రం.. ముఖ్యమైన పత్రాలు వారి వద్దే ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించామని ఫోరం విచారణలో వాదించింది. ఈ వాదనలతో మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోలేరని ఎమిరేట్స్ కు ఫోరం తెలిపింది. చివరికి అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని ఫోరం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News