: బాబురావు అరెస్టుపై వెనకడుగెందుకు?... ఏపీ సర్కారును నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి ఆర్కే రోజా మరోమారు చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున వర్సిటీలో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేసే విషయంపై ప్రభుత్వం వెకనడుగు వేయడానికి కారణమేమిటని ఆమె నిలదీశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు కోసమంటూ ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదని కూడా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన కార్పొరేట్ కళాశాల ‘నారాయణ’లో 11 మంది విద్యార్థులు చనిపోయారని ఆమె ఆరోపించారు. తక్షణమే నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.