: మహిళల చేరికతో దూసుకుపోనున్న ఇండియా: ఐఎంఎఫ్ చీఫ్
భారత కార్మిక శక్తిలో పెరుగుతున్న లింగ సమానత్వం స్థూల జాతీయోత్పత్తిని 27 శాతం వరకూ పెంచనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎక్ష్) చీఫ్ క్రిస్టీన్ లగార్డే వ్యాఖ్యానించారు. ఇండియాలో మహిళా వర్కర్లు పురుషులతో సమానంగా విధులను నిర్వహిస్తుండటం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ కారణంగా భవిష్యత్ లో ఇండియా దూసుకుపోతుందని ఆమె అంచనా వేశారు. డబ్ల్యూ 20 (వుమెన్ 20- అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మహిళా ప్రతినిధుల సమాఖ్య) సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా లగార్డే మాట్లాడారు. మహిళలు ఆర్థిక వృద్ధిని ఎంతో పెంచుతారనడంలో ఎటువంటి సందేహం లేదని ఆమె వివరించారు. " ఉదాహరణకు... మా వద్ద ఉన్న అంచనాల ప్రకారం, ఒకే స్థాయిలో పనిచేస్తున్న పురుష, మహిళల ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉంటే, అమెరికాలో 5 శాతం, జపాన్ లో 9 శాతం వరకూ జీడీపీపై ప్రభావం ఉంటుంది. ఇక ఇండియాలో అయితే, జపాన్ తో పోలిస్తే మూడు రెట్ల వరకూ పాజిటివ్ ఫలితాలు వస్తాయి" అని తన ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇవి అంచనాలు మాత్రమేనని, వాస్తవ పరిస్థితుల్లో అంతకు మించిన ఫలితాలు నమోదు కావచ్చని పేర్కొన్నారు. నవంబర్ 2014లో జీ-20 సమావేశాల్లో తీసుకున్న 'లింగ సమానత్వం' నిర్ణయాలను అమలు చేయాలని ఆమె కోరారు. ప్రపంచ ఎకానమీ 10 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉందని, వీటిల్లో 5 కోట్లు మహిళలకు దక్కాలని ఆమె అభిలషించారు. 2025 నాటికి కార్మిక శక్తిలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం వస్తుందని భావిస్తున్నామని, ఈ దిశగా అన్ని దేశాలూ కృషి చేయాలని కోరారు.