: చైనాలో ముగిసిన సెలవులు... ప్రపంచం కళ్లంతా రేపటిపైనే!


చైనాలో స్టాక్ మార్కెట్ సెలవులు ముగిశాయి. రేపు స్టాక్ మార్కెట్లు తిరిగి తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఇన్వెస్టర్ల కన్ను రేపటి చైనా మార్కెట్ పయనంపై ఉంది. ఇప్పటికే గత నాలుగు వారాలుగా నష్టపోతూ వస్తున్న వరల్డ్ స్టాక్ మార్కెట్ తదుపరి దిశా నిర్దేశంపై చైనా మార్కెట్ సరళి ప్రభావాన్ని చూపనుంది. కాగా, సెన్సెక్స్, నిఫ్టీలు నవంబర్ 2011 తరువాత వారం రోజుల వ్యవధిలో అత్యధిక పతనాన్ని గతవారం కళ్లజూశాయి. దేశవాళీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దిగజారేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు దోహదపడ్డాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారాంతానికి సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టపోయింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 4.5 శాతం పతనం. ప్రస్తుతం 25,202 పాయింట్ల వద్ద సెన్సెక్స్ సూచిక ఉండగా, ఈ వారంలో 347 పాయింట్లు దిగజారిన నిఫ్టీ 7,655 పాయింట్ల వద్దకు చేరింది. మిడ్ కాప్, స్మాల్ కాప్ లపైనా ఒత్తిడి పెరగడంతో ఈ సూచీలు మూడున్నర శాతం నష్టపోయాయి. మార్కెట్ పతనానికి చైనాతో పాటు రుతుపవనాల నుంచి ఉల్లి ధరల వరకూ కారణమయ్యాయి. "బలహీనంగా ఉన్న రుతుపవనాలు, ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల, వడ్డీ రేట్లు తగ్గుతాయో లేదోనన్న భయాలు ఇన్వెస్టర్లను వేచిచూసేలా చేస్తున్నాయి. విదేశీ ఫండ్ సంస్థలకు సైతం ఇవే భయాలున్నాయి. వచ్చే నెలలో వెల్లడయ్యే కార్పొరేట్ కంపెనీల రెండవ త్రైమాసికం ఫలితాలు, చైనా సరళి, యూఎస్ ఫెడ్ సమీక్ష తదితరాంశాలు మార్కెట్ ను నడిపించనున్నాయి" అని రీసెర్చ్ అండ్ అడ్వయిజరీ సేవల సంస్థ ఈక్వినామిక్స్ వ్యవస్థాపక ఎండీ జీ చొక్కలింగం వ్యాఖ్యానించారు. కాగా, గత వారంలో ఎఫ్ఐఐలు మొత్తం రూ. 4,300 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను మన మార్కెట్ నుంచి విక్రయించినట్టు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించినంత వరకూ మ్యాట్ (మినిమమ్ ఆల్టర్నేటివ్ టాక్స్ - కనీస ప్రత్యామ్నాయ పన్ను) విధించవద్దని మాజీ లా కమిషన్ చైర్మన్ ఏపీ షా కమిటీ ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించడం కొంతమేరకు మార్కెట్ కు లాభాలను అందించే అంశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చి త్రైమాసికంతో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి రేటు జూన్ త్రైమాసికంలో తగ్గడం మార్కెట్ గమనంపై నీలినీడలను పెంచింది. దీనికితోడు ఐఐపీని ప్రభావితం చేసే ఎనిమిది ముఖ్యమైన రంగాల్లో వృద్ధి రేటు నామమాత్రంగా 1.1 శాతానికి పరిమితమైంది. దీంతో ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ ఈక్విటీ 11 శాతం నష్టపోగా, ఎల్అండ్ టీ 5 శాతం దిగజారింది. ఈ కారణాలన్నీ విశ్లేషిస్తే మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్యనే మరికొంత కాలం నడుస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News