: చంద్రబాబును భిక్షమడిగిన అవ్వ... జేబులో నుంచి డబ్బు తీసిచ్చిన ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఓ ముదుసలి భిక్షమడిగింది. ఒక్క క్షణం అవాక్కయిన ఆయన, వెంటనే తన జేబు నుంచి కొంత డబ్బు తీసి ఆమెకిచ్చారు. ఈ ఘటన చంద్రబాబు విశాఖపట్నంలో రెండో రోజు పర్యటన సందర్భంగా జరిగింది. విశాఖ పరిధిలోని రాంనగర్, పందిమిట్ట ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. నేడు పొద్దున్నే ఆ ప్రాంతానికి వెళ్లిన బాబు, వాకర్లతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల విషయంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. మనోరమా థియేటర్ దగ్గర పార్కు శానిటేషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు అధికారులను మందలించారు. ఇకపై పరిశుభ్రత విషయంలో అలక్ష్యం వహిస్తే సహించేది లేదని జోనల్ కమిషనర్ ను హెచ్చరించారు. పోర్టు ట్రస్టు, ఎఫ్ఆర్ కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సూచనలు చేశారు. ఆ సమయంలోనే తనకేమీ దిక్కు లేదని, ధన సహాయం చేయాలని ఓ అవ్వ బాబు దగ్గర వేడుకుంది. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా బాబు దగ్గరకు దూసుకొచ్చింది. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న బాబు, తన జేబులో చెయ్యి పెట్టి కొన్ని రూ. 500 కాగితాలు బయటకు తీశారు. అవి ఎన్నున్నాయో కూడా లెక్కించకుండా, ఆమె చేతిలో పెట్టారు. ఆ అవ్వ సంతోషంతో దీవిస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోయింది.