: శరణార్థులను ఆదుకునేందుకు 2 మిలియన్ డాలర్లు ప్రకటించిన ఒలింపిక్ సంఘం
ప్రాణాలు దక్కించుకోవాలనే తాపత్రయంతో మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాల నుంచి వచ్చి పడుతున్న శరణార్థులను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు కదులుతోంది. తమ దేశంలో సర్వస్వం వదులుకుని కట్టుబట్టలతో వస్తున్న వలసదారులకు ఏదో ఒకటి చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తున్నారు. అందులో భాగంగా శరణార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలకు పలువురు విరాళాలు పంపుతున్నారు. కొన్ని పెద్ద సంస్థలు నేరుగా రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం రెండు మిలియన్ డాలర్ల నిధిని శరణార్థులను ఆదుకునేందుకు వెచ్చించనుంది. సిరియా, ఇరాక్, ఆఫ్రికా దేశాల నుంచి తరలుతున్న శరణార్థులను ఆదుకునేందుకు ఆయా దేశాల ఒలింపిక్ సంఘాలకు ఆ మొత్తాన్ని పంపనున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధామస్ బాక్ తెలిపారు. ప్రాణాలరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్తూ, పలు కుటుంబాలు సముద్రంలో మునిగిపోతున్న వార్తలు తమను కలచివేశాయని ఆయన చెప్పారు. వారిని తక్షణం ఆదుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నామని ఆయన ప్రకటించారు.