: ఒకే ర్యాంకు- ఒకే పింఛను అమలు చేస్తున్నాం: కేంద్రం ప్రకటన
గత 80 రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికులు విజయం సాధించారు. మాజీ సైనికుల ఆందోళనకు కేంద్రం తలొగ్గింది. ఒకే ర్యాంకు-ఒకే పింఛను విధానాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశరక్షణలో సైనికుల సేవలు అసమానమైనవని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఢిల్లీలో ఒకే ర్యాంకు ఒకే ఫించనుపై ప్రకటన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే ర్యాంకు ఒకే ఫించన్ వ్యవహారం నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం వద్ద నలుగుతోందని అన్నారు. సైనికుల జీత భత్యాల కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించామని అన్నారు. ఒకే హోదా ఒకే ఫించన్ పథకం అమలు చేయడం వల్ల 8 వేల కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడుతుందని ఆయన తెలిపారు. ఒకే ర్యాంకు ఒకే ఫించను విధానం అమలు చేస్తే ఏడాదికి అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని గత ప్రభుత్వాలు పేర్కొన్నాయని ఆయన తెలిపారు. అది నిజం కాదని ఆయన వెల్లడించారు. అయితే ప్రధాని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఖర్చు చేసి ఆ భారం భరించేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మేధావులతో చర్చ సందర్భంగా సైనికుల రిటైర్మెంట్ సాధారణ ఉద్యోగుల రిటైర్మింట్ లా ఉండదని, అందరూ ఒకేలా రిటైర్ అవ్వరని, అందుకే ఒకే ర్యాంకు ఒకే ఫించన్ అసాధ్యమని అంతా అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. అయితే దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన సైనికులకు ఆమాత్రం ప్రయోజనం కల్పించడం సరైన నిర్ణయమేనని భావించి కేంద్రం ఒకే ర్యాంకు ఒకే ఫించన్ పథకం అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.