: ఆడుకోవాలంటే అంతే... పెట్టుబడులతో వస్తే స్వర్గధామమే!
భారత స్టాక్ మార్కెట్లో బుల్ ర్యాలీ ముగిసిందని, రోజువారీ ట్రేడింగ్ చేస్తూ లాభపడాలని భావించే ట్రేడర్లకు కష్టకాలం వచ్చినట్టేనని, ఇదే సమయంలో పెట్టుబడులతో వచ్చి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలని భావించేవారికి మార్కెట్ స్వర్గధామమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2014లో భారత స్టాక్ మార్కెట్ 30 శాతం పెరిగి ట్రేడర్లకు ఎంతో సంపదను దగ్గర చేసింది. కానీ, 2015లో అదే పునరావృతం కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు. మార్చిలో రికార్డు స్థాయితో పోలిస్తే ఇప్పుడు 15 శాతం దిగువకు పడిపోయింది. ఆ దశలో వివిధ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఇప్పుడెంతో నష్టపోయి ఉన్నారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు, అందునా ఆరు నెలలో, సంవత్సరమో పెట్టుబడిగా పెట్టాలనుకున్న వారి పెట్టుబడులు కుంచించుకు పోయాయి. "ట్రేడర్లకు బుల్ మార్కెట్ ముగిసినట్టే. సమీప భవిష్యత్తులో తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్ సాగుతుంది" అని కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా వ్యాఖ్యానించారు. ఇండియాలో ద్రవ్య లోటు తగ్గుతుండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, జీడీపీ 7 శాతానికి మించి పెరిగే అవకాశాలు ఉండటం ప్రపంచ ఇన్వెస్టర్లకు ఎడారిలో ఒయాసిస్ లాంటిదని అన్నారు. ఈ సంవత్సరమంతా స్టాక్ మార్కెట్ ఆల్ టైం రికార్డు స్థాయులను దాటే పరిస్థితి కనిపించడం లేదని, ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు జరిగే యూఎస్ ఫెడ్ సమావేశాలు, ఆపై 29న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమావేశం మార్కెట్ కు దిశానిర్దేశం చేస్తాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచిక 7,700 నుంచి 7,800 మధ్య ఉన్నంతకాలం ఇన్ట్రాడే ఇన్వెస్టర్లకు గడ్డు కాలమేనని పీఎన్బీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గురాంగ్ షా వివరించారు. స్వల్పకాల కరెక్షన్ దిశగా మార్కెట్ పడుతూ లేస్తూ ఉంటే, రోజువారీ ట్రేడింగ్ లో నష్టపోయే అవకాశాలే అధికమని ఆయన అన్నారు.