: ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన టీసీఎస్, కాగ్నిజంట్
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రముఖ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సంస్థలు చాలా సంవత్సరాల తరువాత ఫ్రెషర్స్ వేతన ఆఫర్లను పెంచాయి. గత సంవత్సరంతో పోలిస్తే, కొత్తగా ఇంజనీరింగ్ క్యాంపస్ ల నుంచి తీసుకునే ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం అదనపు వేతనాలు ఆఫర్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉద్యోగార్థుల్లో నైపుణ్యత పెరగడం, ఆటోమేషన్ విస్తరణ, వెల్లువలా దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు... తదితర కారణాలతో దిగ్గజ కంపెనీలపై ఒత్తిడి వుందని నిపుణులు వ్యాఖ్యానించారు. భారత్ లో ఐటీ ఉద్యోగులను ఆక్సెంచర్, కాగ్నిజంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో సంస్థలు అత్యధికంగా నియమించుకుంటున్నాయి. అయితే, ఐటీ ఇంజనీర్ల సంఖ్య అధికంగా ఉండటం, స్టార్టింగ్ వేతనం విషయంలో ఈ కంపెనీలకు కొంత బేరసారాలకు అవకాశాలను దగ్గర చేస్తోందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. 2014-15లో మొత్తం 13 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగా, వారిలో కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేసింది. దేశవాళీ స్టార్టప్ కంపెనీలు ఆకర్షణీయంగా ఉండేలా సాలీనా రూ. 5 లక్షలకు మించిన వేతన ప్యాకేజీలు ఇస్తుండటంతో, పెద్ద కంపెనీలు సైతం అదే దారిలో నడవక తప్పని పరిస్థితి నెలకొందని క్రెడిట్ సూసీ వివరించింది.