: కాపులకు ప్రత్యేక కార్పోరేషన్... చంద్రబాబు ప్రకటనపై చినరాజప్ప హర్షం
కాపు సామాజిక వర్గానికి చెందిన వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హర్షం ప్రకటించారు. నేటి ఉదయం చినరాజప్ప సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గానికి గతంలో ఇచ్చిన హామీలపై వారిద్దరూ చర్చించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. త్వరలో కాపులకు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని చినరాజప్ప చెప్పారు.