: మాపై అత్యాచారం చేయాలట: ఖాప్ పంచాయతీ తీర్పుపై అక్కా చెల్లెళ్ల భయాందోళన
తమ సోదరుడు, ఓ అగ్రవర్ణ యువతి ప్రేమించుకున్నందుకు మమ్మల్ని బలి పశువులను చేయాలని చూస్తున్నారంటూ, ఇద్దరు అక్కా చెల్లెళ్లు వాపోతున్నారు. తమ పరిస్థితి గురించి ప్రధాని, ముఖ్యమంత్రి, మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ లకు లేఖలు రాసినా స్పందన లేదని, రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఢిల్లీకి 30 కి.మీ దూరంలో ఉన్న యూపీ పరిధిలోని సంక్రోట్ గ్రామానికి చెందిన మీనాక్షీ కుమారి (23) ఆందోళన వ్యక్తం చేసింది. తాము ఊరికి వెళితే, తమపై అత్యాచారం చేయడానికి ఎందరో కాచుకు కూర్చున్నారని తెలిపింది. తమ గ్రామంలో ఏడువేల మంది జాట్ కులస్తులు, 250 మంది దళితులు ఉన్నారని వెల్లడించిన ఆమె, మరిన్ని వివరాలు చెబుతూ, "నా అన్న రవికుమార్, జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగితే, జరిగే పర్యవసానాలపై చర్చించుకున్న మీదట ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆపై అతనితో ఉండలేక తిరిగి ఊరికి వచ్చింది. పాత ప్రేమికులు తిరిగి కలుసుకుని, ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. దీంతో జాట్ కులస్తులు తమ పలుకుబడిని ఉపయోగించి, మా అన్నపై మాదకద్రవ్యాల కేసు పెట్టి మీరట్ జైలుకు పంపారు. ఆ కేసులో బెయిల్ వచ్చినా ఊరి పెద్దలకు భయపడి అన్న జైల్లోనే ఉన్నాడు. సంక్రోట్ గ్రామ పంచాయతీ సమావేశమై, రవికి చెల్లెళ్లమైనందుకు, మా ఇద్దరిపైనా అత్యాచారం చేయాలని, ఊరి వీధుల్లో నగ్నంగా ఊరేగించాలని తీర్పిచ్చారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో ఓ పెళ్లి కోసం ఢిల్లీ వచ్చిన మాకు విషయం తెలిసి, ఇక్కడే మారుమూల తలదాచుకున్నాం. ఇలా ఎంతకాలం దాక్కోవాలి? ఊరికి వెళితే, మా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. ఖాప్ పంచాయతీలు చెల్లవంటూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు పట్టించుకునేవారు లేరు. మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా" అని మీనాక్షి తెలిపింది.