: రాజమండ్రి ఎన్నారై కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
రాజమండ్రిలోని సోమాలమ్మ దేవాలయం దగ్గర్లోని ఇంటీరియర్ డెకరేషన్ షాప్ వద్ద గుర్తు తెలియని ఎన్నారైను స్కోడా కారులో వచ్చిన నలుగురు బెదిరించి కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందివాడ గ్రామం దగ్గర నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్లలో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు స్త్రీలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఎన్నారై చక్రవర్తి క్షేమంగా ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. విశాఖపట్టణానికి చెందిన చక్రవర్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువుర్ని మోసం చేశాడని పేర్కొన్నారు. ఓ యువతిని వివాహం చేసుకుంటానని వంచించాడని, అతను తీసుకున్న డబ్బును వసూలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అతనిని కిడ్నాప్ చేశామని, అతనికి హాని కల్పించాలన్న ఉద్దేశం తమకు లేదని నిందితులు స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న వారందర్నీ రాజమండ్రి పోలీసులకు అప్పగిస్తామని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు.