: దొరికిన ఫోన్ ను ‘ఓటుకు నోటు’ నిందితులు వాడారా?... సెల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఏసీబీ నోటీస్
అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం హైదరాబాదులో ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. పోయిన ఫోన్ కోసం వెతుకులాడిన ఆ వ్యక్తి 'ఇక దొరకదులే' అని వదిలేశాడు. ఆ తర్వాత తన సొంతూరు వెళ్లిపోయాడు. తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో విచారణ చేయాల్సి ఉందని, తమ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో ఏసీబీ అధికారులు సదరు వ్యక్తికి ఆదేశాలు జారీ చేశారు. అయితే సాదాసీదా వ్యక్తి అయిన తనకు ఏసీబీ నోటీసులు రావడంతో ఆ వ్యక్తి బెంబేలెత్తిపోయాడు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని నెత్తినోరు బాదుకుంటున్నాడు. వివరాల్లోకెళితే... కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం హైదరాబాదులో కొన్నాళ్ల పాటు ఉన్నాడట. ఆ సమయంలో అతడు తన ఫోన్ ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు తన సొంతూరికి వెళ్లిపోయాడు. అతడు వాడిన నెంబర్ నుంచి ఓటుకు నోటు కేసుకు సంబంధించి బేరసారాలు సాగాయట. దీనిపై స్పష్టమైన ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు రాములుకు నోటీసు జారీ చేశారు. అయితే తాను పోగొట్టుకున్న ఫోన్ ను తీసుకున్న ఎవరైనా దానిని వాడారో, లేదోనన్న విషయం తనకు తెలియదని రాములు చెబుతున్నాడు. అయితే ఏసీబీ విచారణలో కాని వాస్తవాలు వెలుగు చూసేలా లేవు.