: చెన్నారెడ్డి నుంచి ఎంతో మందిని చూశాను... ఇప్పుడీ జగన్ ను చూడాల్సిన దరిద్రం పట్టింది: బాబు
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చెన్నారెడ్డి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను, నేతలను చూశానని, ఆ కళ్లతో ఇప్పుడీ జగన్ ను చూడాల్సిన దరిద్రం పట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. "అయినా నేనేం భయపడను. విపక్షాల ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దు. మనం ప్రభుత్వంలో ఉన్నాం. సంయమనం పాటిద్దాం. మన హక్కులు కాపాడుకుందాం. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు మైకు కూడా ఇవ్వలేదు. నీకు అదన్నా ఇస్తున్నాం... సంతోషించు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భరించక తప్పదు" అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "ఓ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తనపై మరో రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విచారిస్తుంది? ఆ దమ్మూ, ధైర్యం ఉన్నాయా? నా రాజకీయ జీవితంలో నిప్పులా బతికాను. ఇకపైనా అలానే ఉంటాను. నాపై బురదజల్లితే చూస్తూ ఊరుకునేది మాత్రం లేదు" అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.