: రూ. 3 వరకూ తగ్గనున్న పెట్రోలు ధర... సాయంత్రం ప్రకటన!
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ సాయంత్రం మరో శుభవార్తను వినిపించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడాయిల్ ధరల కారణంగా పెట్రోలు, డీజెల్ ధరలను తగ్గిస్తూ, ఈ సాయంత్రం ప్రకటన వెలువరించనున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు సమావేశమై, ఏ మేరకు తగ్గింపునకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని చర్చించనున్నారు. కాగా, ప్రస్తుత ఇంటర్నేషనల్ మార్కెట్లో సెప్టెంబర్ 21న డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర బ్యారలుకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 32 తగ్గి రూ. 2,973 వద్ద కొనసాగుతోంది. ఇక ఆగస్టులో భారత బాస్కెట్ సరాసరి 48 డాలర్లకు తగ్గింది. దీంతో లీటరు పెట్రోలుపై రూ. 3 వరకూ తగ్గింపు ప్రకటన వెలువడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజెల్ పై రూ. 2 నుంచి రూ. 3 వరకూ తగ్గింపు ఉంటుందని అంచనా.