: ఏపీ ఖజానాకు జగన్ అక్రమాస్తులు?... కొత్త చట్టం రూపకల్పనలో చంద్రబాబు ప్రభుత్వం
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలకు పైగా పోగేశారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సదరు అక్రమాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటామని కూడా ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ అక్రమాస్తులతో పాటు ఇతరులు పోగేసిన అక్రమాస్తులను కూడా స్వాధీనం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రత్యేెకంగా ఓ చట్టాన్ని కూడా రూపొందించాలని కూడా ప్రభుత్వం దాదాపుగా రంగంలోకి దిగింది. నిన్నటి కేబినెట్ సమావేశంలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమార్కుల సొమ్ముతో పాటు వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు కూడా తమకే చెందే విధంగా చట్టాన్ని రూపొందించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారట. ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా ఈ తరహా యత్నాలు ఫలించవని, ప్రత్యేక చట్టంతోనే అది సాధ్యమని జైట్లీ సూచించారట. జైట్లీ సూచనలతోనే ఏపీ సర్కారు కొత్త చట్టం రూపకల్పనకు నడుం బిగిస్తోంది. ఇప్పటిదాకా అవినీతి కేసులను దర్యాప్తు చేస్తున్న ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆయా కేసుల్లో నిందితులు దోషులుగా తేలితే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి వచ్చిన సొమ్మును కేంద్ర ఖజానాలో జమ చేస్తున్నాయి. అయితే తమ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సొత్తు కేంద్ర ఖాతాలో వేయడం సబబు కాదన్న వాదనే కొత్త చట్టం రూపకల్పనకు నాంది పలికిందని తెలుస్తోంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టిన కేసుల్లోని ఆస్తులను చేజిక్కించుకోవాలంటే సదరు చట్టానికి కేంద్రం ఆమోదం తప్పనిసరి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి సూచనల మేరకు తాము రూపొందిస్తున్న ఈ చట్టానికి కేంద్రం ఆమోదం సులువుగానే లభిస్తుందని కూడా చంద్రబాబు ప్రభుత్వం ధీమాగా ఉంది.