: లంక టోర్నీ కారణంగా ‘అర్జున’ అందుకోలేకపోయిన రోహిత్..‘ఖేల్ రత్న’ కోసం అమెరికా నుంచి పరుగెత్తుకొచ్చిన సానియా
క్రీడా రంగంలో సత్తా చాటిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం నిన్న రాష్ట్రపతి భవన్ లో కన్నుల పండువగా జరిగింది. తాజా అవార్డుల్లో భాగంగా వన్డేల్లో డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. అయితే ప్రస్తుతం లంక టూర్ లో ఉన్న రోహిత్ శర్మ నిన్న రాష్ట్రపతి భవన్ కు రాలేకపోయాడు. అదేవిధంగా అవార్డులకు ఎంపికైన ఆథ్లెట్ ఎంఆర్ పూవమ్మ, బాక్సర్ మన్ దీప్ జంగ్రాలు వివిధ టోర్నీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారూ కూడా నిన్నటి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. మరోపక్క యూఎస్ ఓపెన్ కోసం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే అమెరికా వెళ్లిపోయింది. సానియాకు ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డును ప్రదానం చేయకుండా తాత్కాలికంగా నిలిపేయాలని కర్ణాటక హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టిన కేంద్రం, సానియాకు అవార్డును బహూకరించేందుకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్నటి కార్యక్రమం కోసం అమెరికా నుంచి హుటాహుటీన ఢిల్లీ చేరుకున్న సానియా నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుంది.