: నడిరోడ్డుపై కాలి బూడిదైన బస్సు... ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
గడచిన రాత్రి పెను ప్రమాదం తప్పింది. నిండా ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిరోడ్డుపై కాలి బూడిదైంది. అయితే, ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమని చెప్పడంతో, బస్సులో షార్ట్ సర్క్యూట్ అయిన విషయాన్ని పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించి బస్సులోని ప్రయాణికులను దించేయడంతో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకెళితే... కేరళలోని కల్లాడ ట్రావెల్స్ కు చెందిన ఓ వోల్వో బస్సు, నిన్న రాత్రి 35 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుంచి కాలికట్ కు బయలుదేరింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జనకెళ్లాలన్న అభ్యర్థనతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. ప్రయాణికుడు బస్సు దిగిన వెంటనే డ్రైవర్ కూడా కిందకు దిగి టైర్లలో గాలిని పరిశీలించేందుకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్న పాటి అగ్ని కీలలు డ్రైవర్ కు కనిపించాయి. దీంతో వెనువెంటనే అప్రమత్తమైన అతడు ప్రయాణికులను బస్సు దింపేశాడు. ప్రయాణికులు బస్సు దిగిన కొద్దిక్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. మూత్ర విసర్జన కోసం ప్రయాణికుడు బస్సు ఆపకున్నా, డ్రైవర్ కిందకు దిగకున్నా ఘోర ప్రమాదం సంభవించేదే. ఇదే విషయాన్ని మననం చేసుకున్న ప్రయాణికులు తీవ్ర షాక్ కు గురయ్యారు.