: శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన పుజారా, మిశ్రా
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్ పుజారా అద్భుత ఆటతీరును కనబరిచాడు. ఒక వైపు వికెట్లు పడిపోతున్నా, పూర్తి ఏకాగ్రతతో ఆడిన పుజారా మొత్తం 13 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. మరోవైపు, పుజారాకు అండగా నిలబడ్డ అమిత్ మిశ్రా అద్భుతమైన ఆటతీరుతో 59 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వీరిద్దరూ కలసి, భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకున్న శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లారు. ఈరోజు టెస్టు మ్యాచ్ రెండో రోజు ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. రాహుల్ (2), రహానే (8), కోహ్లీ (18), రోహిత్ శర్మ (26), బిన్నీ (0), నమన్ ఓజా (21), అశ్విన్ (5) పరుగులు చేశారు. నైట్ వాచ్ మెన్ గా బరిలోకి దిగిన ఇషాంత్ శర్మ (2) తన వికెట్ ను కాపాడుకున్నాడు. సెంచరీ హీరో పుజారా నాటౌట్ గా ఉన్నాడు. శ్రీలంక జట్టులో ప్రసాద్ 4, మ్యాథ్యూస్, ప్రదీప్, హెరాత్, కౌశాల్ చెరో వికెట్ తీశారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.