: క్రేజీగా టాటూ వేయించుకుంది... చర్మవ్యాధితో బాధపడుతోంది
యువతం లేటెస్ట్ క్రేజ్ టాటూ... సినీతారలు రకరకాల టాటూలతో కనిపిస్తుండడంతో వారిని వేలం వెర్రిగా అభిమానించే యువకులు కూడా టాటూలు వేయించుకుంటున్నారు. న్యూయార్క్ కు చెందిన టిఫనీ పాస్టిరారో ఇలాగే క్రేజీగా టాటూ వేయించుకుంది. కొంత కాలం దానికి స్నేహితుల్లో గుర్తింపు కూడా తెచ్చింది. ఆ తరువాత ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె ఒంటి నిండా తెల్లని, నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. ఇవి అంటువ్యాధిగా వ్యాప్తి చెందుతుండడంతో ఆమె పక్కన నిలబడేందుకు కూడా ఇప్పుడు అంతా వెనకాడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను అంతా అసహ్యించుకుంటున్నారు, ఇంకొందరు హేళన చేస్తున్నారు. దీంతో వైద్యులను సంప్రదించగా, టాటూల కారణంగా విటిలిగో అనే ఓ చర్మవ్యాధి సోకిందని తేల్చారు. దాంతో తన శరీరంపై మచ్చలు కనపడకుండా దట్టంగా మేకప్ వేసుకుంటున్నానని పాస్టిరారో తెలిపింది. 2014 అమెరికన్ టాప్ మోడల్ కంటెస్టెంట్ విన్నీ హార్లో కూడా ఇదే వ్యాధితో బాధపడుతోందని పాస్టిరారో తెలుసుకుంది. దీంతో టాటూలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు శరీరంపై పెద్ద టాటూ వేసుకుని వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించి సోషల్ మీడియా ద్వారా కూడా పాస్టిరారో అవగాహన కల్పిస్తోంది. వేలం వెర్రిగా క్రేజ్ అంటూ వెంటపడడం కాకుండా, వీటిని ఎందుకు వేసుకునేవారో, ఎందుకు వేసుకుంటారో తెలుసుకుని వేయించుకోవడం అవసరం అని పాస్టిరారో హెచ్చరిస్తోంది. కాగా, పురాతన కాలం నుంచే టాటూలు ఉండేవి. వాటిని అప్పట్లో పచ్చబొట్టు అని పిలిచేవారు.