: రైల్వేలో ఉద్యోగమిప్పిస్తామని చెప్పి అ యువతిని అమ్మేశారు!


ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళను వ్యభిచార కూపం నుంచి ఢిల్లీ పోలీసులు రక్షించారు. ఢిల్లీలోని గౌతమబుద్ధ రోడ్ లోని రెడ్ లైట్ ఏరియాపై పోలీసులు 'ఆపరేషన్ ముక్తి' నిర్వహించారు. ఈ ఏరియాలో వ్యభిచారం నిర్వహిస్తారన్న విషయం పోలీసులు సహా నగరవాసులకు చాలా మందికి తెలిసిందే. అయితే అక్కడ పోలీసులు ఆపరేషన్ నిర్వహించడానికి ప్రకాశం జిల్లాకు చెందిన సదరు యువతే కారణం. అక్కడికి వెళ్లే ఓ విటుడు ప్రకాశం జిల్లాకు చెందిన యువతి వద్దకు వెళ్లాడు. అతని వద్ద ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. సదరు విటుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, విషయం వివరించాడు. దీంతో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆ యువతికి విముక్తి కల్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన సదరు యువతి తమ పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మాయ మాటలకు పడిపోయి, ఈ వ్యభిచార రొంపిలోకి వచ్చిపడింది. 'ఢిల్లీలో తమకు బాగా తెలిసినవారు ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఢిల్లీ వస్తే వారి ద్వారా రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తా'నని పక్కింటి ఆ మహిళా ఆమెను ఆశపెట్టింది. ఉద్యోగంపై ఆశతో ఆమె వారితో కలిసి ఢిల్లీ వెళ్లింది. అక్కడకు వెళ్లిన తరువాత యువతి నమ్మకాన్ని వమ్ముచేస్తూ, తనను వ్యభిచార గృహానికి విక్రయించారని ఆ యువతి పోలీసులకు తెలిపింది. ఆమె చెప్పిన వివరాలు సరిపోల్చుకుని, ఆమెను ఏపీ పోలీసులకు అప్పగించేందుకు ఢిల్లీ పోలీసులు బయల్దేరారు.

  • Loading...

More Telugu News