: నెల రోజుల సెల్లు బిల్లు రెండున్నర లక్షలు... నిజమైన బిల్లేనని తేల్చిన పోలీసులు


సాధారణంగా నెలకు రూ. 1,200 నుంచి రూ. 1,500 మధ్య వచ్చే మొబైల్ బిల్లు గడచిన ఆగస్టులో రూ. 2,49,112 వచ్చింది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే, వారు విచారించి ఈ బిల్లు నిజమైనదేనని తేల్చారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల నివాసి జయచంద్రరాజు ఓ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కంపెనీ ఇచ్చిన రిలయన్స్ గ్రూప్ సిమ్ ను బ్లాక్ బెర్రీ ఫోన్లో వేసి వాడుకుంటున్నాడు. ఇదే సిమ్ తో ఇంటర్నెట్ నూ వినియోగించుకుంటున్నాడు. రెండు నెలల క్రితం వరకూ బాగానే ఉంది. ఆపై జూలైలో రూ. 2.12 లక్షలు, ఆగస్టులో రూ. 2.49 లక్షలు బిల్లు వచ్చింది. దీంతో జయచంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, తొలుత హ్యాకింగ్ చేసి ఉండొచ్చన్న సమాధానం వచ్చింది. కేసు విచారణలో భాగంగా డేటా గణాంకాలు తీసి చూడగా, మెయిల్స్ నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు, ఆటోమేటిక్ డౌన్ లోడ్లు, యాప్ అప్ డేట్స్ వంటి ఆప్షన్స్ ఆన్ లో ఉంచి పెట్టినందునే ఇంత ఎక్కువ బిల్లు వచ్చిందని తేల్చారు. కంపెనీ మోసం చేయలేదని, తాము రిలయన్స్ పై కేసు పెట్టలేమని, ఈ బిల్లు విషయమై సంస్థతో చర్చించి మాట్లాడుకోవాలని పోలీసులు చెప్పేశారు.

  • Loading...

More Telugu News