: చంద్రబాబు ముఖంపై నవ్వులు పూయించిన సైకో
పశ్చిమగోదావరి జిల్లాలో సంచరిస్తున్న సైకో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖంలో నవ్వులు పూయించాడు. సాధారణంగా చంద్రబాబునాయుడు నవ్వరు. అరుదుగా మాత్రమే ఆయన నవ్వును చూడగలం. బహిరంగ వేదికలపై ఆయన అస్సలు నవ్వరు. అలాంటి చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం సైకోపై అడగగానే నవ్వేశారు. 'వాడెవడండీ, సూది గుచ్చి పారిపోతున్నాడు?' అంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. వెంటనే సైకోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి సూచనలు ఇచ్చానని తెలిపారు. సైకోను పట్టుకోవడం చేతకాకపోతే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించినట్టు చెప్పారు. దీంతో సైకోను పట్టుకునేందుకు 40 బృందాలను నియమించి, ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. సైకో చేస్తున్న నేరం తీవ్రమైనదా? కాదా? అన్నది వేరే విషయమని పేర్కొన్న ఆయన, పోలీసులు ఎంత త్వరగా రక్షణపై భరోసా ఇస్తున్నారన్నది పట్టుకోవడం ద్వారా నిర్ధారణ అవుతుందని తెలిపారు. తక్షణం సైకోను పట్టుకోవాలని ఆయన ఆదేశించారు.