: హోదా విషయంలో చంద్రబాబు ఎవరితోనూ రాజీపడలేదు: సోమిరెడ్డి
సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చించినా ప్రత్యేక హోదా రాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా చేసిన విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎవరితోనూ రాజీపడలేదన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీని బాబు అడిగారని చెప్పారు. ప్యాకేజీగా రూ.2.25 లక్షల కోట్లు అడిగారని వివరించారు. కానీ హోదా విషయంలో కేంద్రంతో బాబు రాజీపడ్డారంటూ ఉండవల్లి మాట్లాడటం సరికాదన్నారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని పెళ్లి కాకుండానే కాపురం చేయమన్నట్టుందని ఉండవల్లి పోల్చడంపై సోమిరెడ్డి మండిపడ్డారు. ఆ నాడు కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ఏం చేశారని ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన (ఉండవల్లి) ఇప్పుడు మాట్లాడటం చూస్తుంటే వైసీపీలో చేరే పరిస్థితి కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇకెప్పుడు జగన్ పార్టీలో చేరతారో చెప్పాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిగారు. ఇక నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు పెడతామని రఘువీరారెడ్డి అనడాన్ని సోమిరెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించి చీకటి బిల్లు తెచ్చిన సోనియాగాంధీపై ముందు క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ను చెప్పుతో కొట్టారని విమర్శించారు.