: అంగ, అర్థ బలాలు పుష్కలంగా ఉన్న హార్దిక్ పటేల్ వెనకున్న శక్తి ఎవరు?
రాజకీయ నాయకులు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించాలంటేనే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ కులమంతటినీ ఏకం చేసి లక్షలాది మందిని ఒకచోటకు చేర్చి, భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలంటే కోట్లు ఖర్చవుతాయి. రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన పటేల్ కులస్తుల బహిరంగ సభా ఇటువంటిదే. దాదాపు 5 లక్షల మంది ఒకచోట చేరడమంటే మాటలు కాదు. ఎంతో ముందస్తు ప్రణాళిక ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఉద్యమంలోకి ఓ విప్లవంలా దూసుకొచ్చిన యువనేత హార్దిక్ పటేల్. ఆయన వ్యక్తిగత జీవితం ఎలావున్నా, విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇప్పుడు గుజరాత్ పటేల్ కులస్తులకు, ముఖ్యంగా యువతకు ఆయన చెప్పిందే వేదం. అసలు హార్దిక్ వెనకున్న శక్తి ఎవరు? దేశరాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించిన 'పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి' బహిరంగ సభ తరువాత గుజరాత్ లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గొడవలు జరిగి, ఎనిమిది మంది చనిపోయి, కర్ఫ్యూ, ఆపై సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పటేల్ కులానికి చెందిన గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ రాజకీయ భవిష్యత్తు సైతం ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతానికి పటేల్ వెనకున్న శక్తి ఎవరన్న విషయం జవాబులేని ప్రశ్నగా ఉన్నా, వారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పటేల్ వ్యతిరేక శక్తులేనని ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వ్యాఖ్యానించినట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో హార్దిక్ పటేల్, వీహెచ్ పీ అధినేత ప్రవీణ్ తొగాడియాలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్ లు ఇప్పటికే తమ ప్రసంగాల్లో హార్దిక్ పేరును ప్రస్తావించి ప్రశంసలతో ముంచెత్తారు. పటేల్ కులస్తుల పోరుకు మద్దతిస్తున్నట్టూ తెలిపారు. వీరిలో ఎవరైనా హార్దిక్ పోరు వెనక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, సబ్ మెర్సిబుల్ పంపుల వ్యాపారం చేస్తూ, ఉద్యమంలోకి వచ్చిన హార్దిక్, తనంతట తానుగా ఇంత పెద్ద ర్యాలీ, సభను ఏర్పాటు చేసుకునే శక్తిని, కోట్ల రూపాయలను కలిగివుంటారని మాత్రం అనుకోలేము.