: కేసీఆర్ నోట ‘మధ్యంతరం’ మాట... టీడీపీ లేకుండా చూడటమే లక్ష్యమట!


టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ ఎత్తగడల్లో దిట్ట. ఉద్యమ సమయంలో తన పార్టీని ప్రజా క్షేత్రంలో బలంగా నిలిపేందుకు పలుమార్లు ఉప ఎన్నికలకు తెరతీసిన ఆయన మెజారిటీ సందర్భాల్లో సత్తా చాటారు. పదేళ్లకు పైగా ఉద్యమాన్ని సజీవంగా వుంచి, చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. తెచ్చిన కొత్త రాష్ట్రం పాలనా పగ్గాలను చేపట్టారు. అప్పటిదాకా ఉన్న పలు పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలతో పాలనలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేదాకా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఉప ఎన్నికలు జరిగేంత పరిస్థితి అంతకన్నా లేదు. అయితే కేసీఆర్ నోటి వెంట ఇటీవల ‘మధ్యంతరం’, ‘ముందస్తు ఎన్నికలు’, ‘శాసనసభ రద్దు’ తదితర పదాలు తరచూ ధ్వనిస్తున్నాయట. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు కూడా ఆయన ఈ పదాలను వల్లె వేస్తున్నారు. అంతేకాక ఏకంగా అధికార యంత్రాంగం ముందు కూడా ఆయన ఈ పదాలను వాడుతున్నారు. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనతోనే కేసీఆర్ ఈ పదాలను వాడుతున్నారా? లేక ఎమ్మెల్యేలను తన గాటన కట్టేసుకునేందుకే ఈ తరహా వ్యూహానికి తెర తీశారా? అన్న విషయాల్లో స్పష్టత రావట్లేదు. ఇటీవల హైదరాబాదు పరిసర నియోజకవర్గాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను ఒకానొక రోజు అల్పాహార విందుకు ఆహ్వానించిన ఆయన నేరుగా వారి ముందు ‘ముందస్తు’ ప్రతిపాదన చేశారట. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు తప్పవన్న వారి వాదనతో కేసీఆర్ విభేదించారట. అప్పటిదాకా ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టాం కదా, ఎందుకు గెలవలేమంటూ వారిని ఆయన నిలదీశారు. దీంతో వారి నోట మాట రాలేదని సమాచారం. అసలు కేసీఆర్ నోట ఈ ‘ముందస్తు’ మాట ఎందుకు వినవస్తోందంటే?, తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని టీడీపీని తెలంగాణలో పూర్తిగా తుడిచివేయాలన్న ఆలోచనే కారణమట. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలోని మెజారిటీ ప్రాంతాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినా, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సత్తా చాటింది. నగర పరిసరాల నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలన్న దిశగా చర్యలు చేపట్టిన కేసీఆర్, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నారు. అయితే, కేసీఆర్ ఆకర్ష్ వల మిగిలిన వారిపై ఫలించలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి హైదరాబాదు నుంచి కూడా టీడీపీని సమూలంగా తరిమికొట్టడమనే లక్ష్యం మేరకే కేసీఆర్ ఈ తరహా ఆలోచన చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరి కేసీఆర్ నోటి వెంట వినిపిస్తున్న ‘ముందస్తు’ మాట ఏ మేరకు వాస్తవమన్న విషయం మరికొంతకాలం పాటు వేచి చూస్తే కాని తేలేలా లేదు.

  • Loading...

More Telugu News