: ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మోదీ మొండి చెయ్యిచ్చారు: సీపీఎం
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితే లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతం వచ్చిన నేపథ్యంలో సీపీఎం పార్టీ మండిపడింది. హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి మొండి చెయ్యిచ్చారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో హోదా కోసం టీడీపీ, బీజేపీలపై లెఫ్ట్ పార్టీలన్నీ ఒత్తిడి తేవాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. అంతకుముందు హైదరాబాదులోని మఖ్దూంభవన్ లో జరిగిన లెఫ్ట్ పార్టీల సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 29న ఏపీలో జరగనున్న వైసీపీ బంద్ కు మద్దతివ్వాలని నాలుగు లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. 28న విజయవాడలో విద్యుత్ అమరవీరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించనున్నారు. 30న సీఆర్ డీఏ పరిధిలో, సెప్టెంబర్ 11, 12 తేదీల్లో కరవు ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీ నేతలు పర్యటించనున్నారు. ఇక బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా 14, 15 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరంలో ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.