: దేవినేని, కామినేనిపై ధ్వజమెత్తిన వంగవీటి రాధా
ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ లపై వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా విమర్శలు గుప్పించారు. విషజ్వర బాధితులకు న్యాయం చేయాలంటూ మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న ధర్నా వేదికపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విషజ్వరాలతో 18 మంది మృతి చెందితే, విష జ్వరాలు లేవని మంత్రి కామినేని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. విష జ్వరాలు ఉన్నాయని, వాటి బారినపడి ప్రజలు మృతి చెందుతున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మంత్రి కామినేని పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. మరో మంత్రి దేవినేని ఉమకు పట్టిసీమ ప్రాజెక్టులో ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధినేతపై అనవసర విమర్శలు చేస్తే వైఎస్సార్, వంగవీటి అభిమానులు ఊరుకోరని ఆయన హెచ్చరించారు.