: 'చిరు దోసె' వెనకున్న అసలు కథ!


రెండు రోజుల క్రితం జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో 'చిరు దోసె' పేరిట ప్రత్యేక దోసెలను అతిథులకు వడ్డించిన సంగతి తెలిసిందే. ఈ దోసె తయారీ విధానానికి పేటెంట్ ను తీసుకోవాలని రాంచరణ్ దరఖాస్తు కూడా చేశాడు. ఇంతకీ ఈ దోసె ఆలోచన చిరంజీవికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్లింట్లోనే ఇదెందుకు స్పెషల్? ఈ స్టోరీని రాంచరణ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ కథ 25 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో మైసూరు సమీపంలో షూటింగ్ జరుగుతున్న వేళ, కేవలం రెండు, మూడు టేబుళ్లు మాత్రమే ఉన్న ఓ చిన్న దాబా హోటలుకు ఫిల్టర్ కాఫీ తాగేందుకు చిరంజీవి వెళ్లారు. కాఫీతో పాటు అక్కడ వేడివేడిగా దోసెలు తిన్నారు. వాటి రుచిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. దాన్నెలా తయారు చేశారో చెప్పాలని ఆ హోటల్ వారిని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆ దోసెలు ఎలా చేస్తామో చెప్పబోమని, అది తమ సీక్రెట్ వంటకమని ఆ హోటల్ నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో చిరంజీవి, తమ ఇంటి వంట మనిషిని పిలిపించి, అక్కడి దోసెలు రుచి చూపించి, వాటిని ఎలా తయారు చేశారో తెలుసుకోమని చెప్పారు. అలా వాళ్లింట్లో తయారైనదే ఈ 'చిరు దోసె'. మొదట్లో మైసూరు దాబాలో ఉన్నంతటి రుచి రాలేదు కానీ, తరువాత ఇంటిల్లిపాదికీ ఎంతో నచ్చిన అల్పాహారంగా ఇది మారిపోయిందని, తమ తండ్రికి 60వ పుట్టినరోజు కానుకగా, ఈ దోసెకు పేటెంట్ ను తీసుకుని ఇస్తానని రాంచరణ్ చెబుతున్నాడు. తమ ఇంటికి వచ్చే అతిథులందరికీ ఈ దోసె ఎంతో ఇష్టమని, రజినీకాంత్ వస్తే 'దోసె ఎక్కడ?' అని అడుగుతారని, రిచర్డ్ గేర్, సచిన్ టెండూల్కర్ వంటి వారూ ఎంతో ఇష్టపడ్డారని చెబుతున్నాడు. పేటెంట్ వచ్చిన తరువాత ఈ దోసెలను ఏపీ, తెలంగాణల్లో ప్రత్యేక వ్యాన్ల ద్వారా విక్రయాలు జరుపుతామని రాంచరణ్ చెప్పాడు. అంటే త్వరలో రాంచరణ్ ఆధ్వర్యంలో 'చిరు దోసె'ల వ్యాపారం మొదలవుతుందన్నట్టేగా!

  • Loading...

More Telugu News