: పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధానికి రోడ్డు మార్గం మీదుగానే వెళుతున్నారు!
నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చేందుకు ఇష్టపడని రైతుల పక్షాన పోరు సాగించేందుకు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి బయలుదేరారు. విజయవాడ శివారులోని గన్నవరం వరకు విమానంలో, అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన పెనుమాక చేరుకుంటారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా హైదరాబాదులోని తన ఇంటి వద్ద కారెక్కిన పవన్ కల్యాణ్ రోడ్డు మార్గం మీదుగానే నవ్యాంధ్ర రాజధానికి బయలుదేరారు. నేటి ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ ఉదయం 10-11 గంటల సమయానికల్లా పెనుమాక చేరుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు పెనుమాకలో ఏర్పాట్లు చేస్తున్న జనసేన ప్రతినిధులు ఓ తెలుగు టీవీ చానెల్ తో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రోడ్డు మార్గం మీదుగానే వస్తున్నారని తెలిపారు.