: పవన్ ట్వీట్లపై "నో కామెంట్" అంటున్న మంత్రి మాణిక్యాలరావు
రాజధాని భూసేకరణ అంశంలో నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్లపై తానేమీ మాట్లాడదలచుకోలేదని ఏపీ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం అంటే భూమి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. భూసేకరణకు రైతులు సహకరించాలని సూచించారు. పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా, వారికింకా జ్ఞానోదయం కాలేదని విమర్శించారు. కాగా, రాజధాని భూసేకరణకు ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన ఏపీ సర్కారుతో అమీతుమీకి సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా భూసేకరణ విషయంలో పవన్ ట్వీట్లు చేస్తుండగా, టీడీపీ నేతలు దీటుగా బదులిస్తున్నారు.