: తెలంగాణ బస్టాండ్లలోనూ వైఫై సేవలు... బీఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో వైఫై సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లలోను, కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను మాత్రమే అందుబాటులో ఉన్న వైఫై సేవలు ఇకనుంచి రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లలోనూ అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ సహా రాష్ట్ర ప్రధాన బస్టాండ్లలో వైఫై సేవలు అందించాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జిల్లా కేంద్రాల్లో వచ్చే నెల మొదటివారం నాటికి వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఎంజీబీఎస్ తో పాటు మెదక్ జిల్లా పటాన్ చెరు బస్టాండులో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత జిల్లా కేంద్రాల్లో కూడా వైఫై సౌకర్యం రానుంది. వైఫై సేవలను మరింత వేగంగా, నాణ్యతతో అందించేందుకు 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగించుకుంటోంది. తొలి అరగంటలో ఈ సేవలు ఉచితంగా ఇవ్వడానికి, తరువాత గంటకు రూ.10 చొప్పున వినియోగ ఛార్జీలను వసూలు చేయడానికి బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.