: పాక్ లోనే అండర్ వరల్డ్ డాన్... పాస్ పోర్టు, భార్య పేరిట టెలిఫోన్ బిల్లుతో మరోసారి రుజువు
1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాకిస్థాన్ వాదన తప్పని మరోసారి తేలింది. పాక్ నగరం కరాచీ శివారులోని క్లిఫ్టన్ లోని ఓ అపార్ట్ మెంటులో దావూద్ నివసిస్తున్నాడన్న విషయాన్ని తాజాగా భారత నిఘా వర్గాలు కనుగొన్నాయి. దావూద్ భార్య మెహ్జాబీన్ పేరిట ఈ ఏడాది ఏప్రిల్ మాసానికి సంబంధించిన టెలిఫోన్ బిల్లుతో పాటు షేక్ దావూద్ హసన్ (ఇది దావూద్ పేరేనట) పేరిట పాక్ విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్ పోర్టు భారత నిఘా వర్గాల చేతికి చిక్కింది. ‘‘డీ-13, బ్లాక్-4, కరాచీ డెవలప్ మెంట్ అథారిటీ, ఎస్ సీహెచ్-5, క్లిఫ్టన్’’కు దావూద్ భార్య మెహ్జాదీన్ పేరిట టెలిఫోన్ బిల్లు జారీ అయ్యింది. ఇక దావూద్ కు జారీ అయిన పాస్ పోర్టులో ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అతడు దిగిన ఫొటో ఉంది. ఇలాంటి పాస్ పోర్టులు అతడికి మూడు దాకా ఉన్నాయట. కుటుంబ సభ్యులతో కలిసి దావూద్ పాక్, దుబాయిల మధ్య ప్రయాణిస్తుంటాడని కూడా భారత నిఘా వర్గాలు పక్కా సమాచారాన్ని సేకరించాయి.