: ‘ఎర్ర’ స్మగ్లర్ తో ఎస్సై బేరసారాలు... అరెస్ట్ చేసిన పోలీసులు
శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసు, అటవీ శాఖలతో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అయితే పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఓ నేరస్థుడితో మిలాఖత్ అయిపోయాడు. ఇప్పటికే స్మగ్లర్ నుంచి రూ.5 లక్షల మేర తీసుకున్న సదరు అధికారి, 'మీరూ వసూలు చేసుకోండి' అంటూ తన సిబ్బందికీ అవకాశమిచ్చాడు. దీంతో విసిగిపోయిన సదరు స్మగ్లర్ నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వసూళ్ల పోలీసు అధికారి తన సొంత శాఖకు చెందిన పోలీసుల చేతిలోనే అరెస్టయ్యాడు. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో వడమాలపేట ఎస్సై రాజశేఖరరెడ్డి నేటి ఉదయం అరెస్టయ్యాడు. ఎర్రచందనం స్మగ్లర్ శివ నుంచి రాజశేఖరరెడ్డి రూ.5 లక్షలు తీసుకున్నాడు. తమకూ అంతే మొత్తం ఇవ్వాలని రాజశేఖరరెడ్డి పనిచేస్తున్న వడమాలపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది శివపై ఒత్తిడి చేశారు. దీంతో శివ నేరుగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాజశేఖరరెడ్డి, వడమాలపేట పోలీసులపై ఫిర్యాదు చేశారు. శివ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రేణిగుంట అర్బన్ సీఐ బాలయ్య వడమాలపేటలో తనిఖీలు చేసి రూ.4 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రాజశేఖరరెడ్డిని అరెస్ట్ చేశారు.