: ‘వాల్’ ఒక్కడే నన్ను భయపెట్టాడు...అతడి వల్ల నిద్రలేని రాత్రులు: షోయబ్ అక్తర్


క్రికెట్ లో దాయాది పోరుగా భావిస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే... సచిన్ బ్యాటింగ్, షోయబ్ అక్తర్ బౌలింగ్ ల మధ్యే పోటీ అని మనమంతా అనుకునేవాళ్లం. నిజమే మరి, నిప్పులు కక్కుతూ దూసుకువచ్చే షోయబ్ అక్తర్ బంతులను ఎదుర్కోవడం ఎవరికైనా కాస్తంత ఇబ్బందే. అల్లంత దూరం నుంచి అతడు పరుగెత్తుకుంటూ వస్తున్న వైనమే ఎదుటి బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే అతడి బంతులను సచిన్ సహా రాహుల్ ద్రావిడ్ లాంటి భారత బ్యాట్స్ మెన్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. అయితే, తనకు ఎదురైన బ్యాట్స్ మెన్ అందరిలోకెల్లా తాను ఒక్క రాహుల్ ద్రావిడ్ కు మాత్రమే భయపడ్డానని ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’గా పేరుపడ్డ అక్తర్ అన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కన్నా, రాహుల్ ద్రావిడ్ అంటేనే తాను బెంబేలెత్తిపోయానని కూడా అక్తర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రావిడ్ వల్ల నిద్రలేని రాత్రులు కూడా గడిపానని కూడా అతడు చెప్పాడు. శారీరకంగానే కాక మానసికంగానూ బౌలర్ అలసిపోయేలా దెబ్బకొట్టగల సత్తా ఒక్క ద్రావిడ్ కు మాత్రమే సొంతమని తెలిపాడు. ద్రావిడ్ ను పెవిలియన్ చేర్చాలంటే, ఒక్క వసీం అక్రమ్ వల్లే సాధ్యపడేదన్నాడు. వెరసి రాహుల్ ద్రావిడ్ అలనాటి ప్రపంచ బాక్సర్ మహ్మద్ అలీతో సమానమని కూడా షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News