: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా, ముఖ్యమంత్రి కోటలో మాత్రం కాంగ్రెస్ పాగా
రాజస్థాన్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 129 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, బీజేపీ 68 చోట్ల విజయం దిశగా సాగుతోంది. కాంగ్రెస్ 33 సీట్లలో ఇతరులు 21 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు మాత్రం నిద్రలేని రాత్రులనే మిగల్చనున్నాయి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం ఝాలావర్ లో రెండు చోట్ల ఎన్నికలు జరుగగా, రెండింటిలో విపక్ష కాంగ్రెస్ సభ్యులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు నైతికంగా పరాజయం పొందారని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమేనని ఆయన అన్నారు. పూర్తి ఫలితాలు చూసిన తరువాత ఎక్కడ లోపం జరిగిందన్న విషయాన్ని విశ్లేషిస్తామని తెలిపారు.