: నవాజుద్దీన్ నటనకు కేజ్రీవాల్ ప్రశంసలు
'మౌంటెన్ మ్యాన్' దశరథ్ మాంఝీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'మాంఝీ' చూసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందులో ప్రధాన పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్దిఖీని అభినందించారు. సినిమాలో అసాధారణమైన నటన ప్రదర్శించారని ఆయన చెప్పారు. సిద్దిఖీ చూపిన నటనా ప్రతిభ స్పూర్తిమంతమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా నవాజుద్దీన్ సిద్దిఖీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, బీహార్ లో దశరధ్ మాంఝీ స్వగ్రామాన్ని ఆనుకుని ఓ కొండ ఉంది. పట్టణంలోకి వెళ్లాలంటే ఆ కొండ చుట్టూ తిరిగి పట్టణం వెళ్లాలి. అలా వెళ్తే 25 కిలోమీటర్ల దూరం వస్తుంది. అదే కొండ లేకపోతే పట్టణానికి ఆ గ్రామానికి మధ్య దూరం కేవలం 5 కిలోమీటర్లే. ఇదిలా వుండగా ఓసారి దశరథ్ మాంఝీ భార్య అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించే సరికి ఆలస్యమైంది. దీంతో అతని భార్య అతని నుంచి శాశ్వతంగా దూరమైంది. భార్య మరణానికి కారణమైన కొండపై కసి పెంచుకున్న దశరథ్ మాంఝీ 25 ఏళ్లు శ్రమించి కొండను తవ్వి తన గ్రామానికి రహదారి సిద్ధం చేశాడు. దశరథ్ మాంఝీ మృతి చెందిన నాలుగేళ్లకు భారత ప్రభుత్వం ఆయన చిరకాల కోరికను నెరవేరుస్తూ తారురోడ్డు వేసింది. సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ భార్యగా రాధికా ఆప్టే నటించారు. కేతన్ మెహతా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.