: ఆదాయపు పన్ను చెల్లిస్తారా?... భారం తగ్గించుకునే మార్గాలివి!


మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వ్యక్తుల జాబితాలో ఉన్నారా? అయితే, పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశాలు పుష్కలం. ఎటొచ్చీ పన్ను మినహాయింపు మార్గాలను ఎంచుకోవడమే కీలకమని అంటున్నారు నిపుణులు. ఇన్ కం టాక్స్ చట్టం సెక్షన్ 80 సి నిబంధన ప్రకారం పొందే రూ. లక్షన్నర పన్ను మినహాయింపులకు తోడు (2014-15కు ముందు రూ. లక్ష మాత్రమే) మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లపై పెట్టుబడుల ద్వారా 80 సిసిఎఫ్‌ నిబంధన ద్వారా అదనంగా మరో రూ. 20 వేల వరకూ పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంటుంది. ఇండియాలో మౌలిక వసతుల కల్పన దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం వీటిల్లో పెట్టుబడులపై పన్ను రాయితీలను ప్రకటించింది. గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ ప్రకటించిన ఇష్యూ, ఐడీఎఫ్సీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ తదితరాల్లో పెట్టే పెట్టుబడులపై రూ. 20 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. ఇక సాధారణ పరిస్థితుల్లో పన్ను ఆదాకు సహకరించే అంశాలను తెలుసుకుంటే, హౌస్ రెంట్ అలవెన్స్: మీరు ఏదైనా అద్దె ఇంట నివసిస్తుంటే, దానికి కట్టే అద్దెలో, బేసిక్ వేతనంపై 50 శాతం వరకూ మినహాయింపు పొందవచ్చు. సొంతింటిలో నివసిస్తుంటే మాత్రం ఈ ఆదా ఉండదు. వాడకుండా మిగిలిన లీవులు నగదుగా మారితే దానిపై పన్ను భారం ఉండదు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన సమయంలో జరిగే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ జరిగితే పరిమిత మొత్తానికే పన్ను రాయితీ లభిస్తుంది. చిన్నారుల విద్యకు ఖర్చు పెట్టే మొత్తం: చిన్నారుల విద్యకు ఖర్చు పెట్టే మొత్తం (ట్యూషన్ ఫీజు)పై సంవత్సరానికి పూర్తి పన్ను మినహాయింపు (గరిష్ఠంగా, 2014-15 వరకు రూ. లక్ష, 2015-16 నుంచి రూ. 1.5 లక్షలు) పొందవచ్చు. ఇద్దరు పిల్లల వరకూ వెచ్చించే మొత్తంపై ఈ మినహాయింపులు కోరవచ్చు. దీనికోసం అన్ని రకాల డాక్యుమెంట్లనూ అడిగినప్పుడు ఆదాయపు పన్ను అధికారులకు సమర్పించాల్సి వుంటుంది. వైద్య ఖర్చులపై: దురదృష్టవశాత్తూ ఇంట్లోని వారికి అనారోగ్యం కలిగితే, వైద్య చికిత్స కోసం పెట్టిన ఖర్చులన్నింటికీ పన్ను మినహాయింపులు కోరవచ్చు. బిల్స్ సమర్పించేదాన్ని బట్టి సంవత్సరానికి రూ. 15 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. మెడికల్ అలవెన్సులు లభిస్తుంటే మాత్రం పన్ను చెల్లించాల్సిందే. మీకు మొబైల్ ఫోన్ సదుపాయాన్ని పనిచేసే యాజమాన్యం కల్పిస్తుంటే, ఆ మొత్తం మీపై పన్ను భారాన్ని మోపదు. ఒకవేళ ఇంట్లో ఫోన్ సౌకర్యాన్ని యాజమాన్యం కల్పించినా ఇదే నియమం వర్తిస్తుంది. మరిన్ని పన్ను రాయితీలను దగ్గర చేసే అంశాల గురించి మరోసారి తెలుసుకుందాం.

  • Loading...

More Telugu News