: టైటిల్ కోసం లంక... ‘సమం’ కోసం టీమిండియా: నేటి నుంచి రెండో టెస్టు


భారత్, శ్రీలంకల మధ్య రెండో టెస్టు నేడు ప్రారంభం కానుంది. లంక రాజధాని కొలంబోలోని పి.సారా ఓవల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే తొలి టెస్టును ఎగరేసుకుపోయిన లంక, బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కరకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాక ఈ మ్యాచ్ లో గెలిస్తే ఏకంగా టైటిల్ ను కూడా చేజిక్కించుకునే అవకాశాలుండటంతో విజయం సాధించి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఆ జట్టు బరిలోకి దిగనుంది. ఇక ఇప్పటికే తొలి మ్యాచ్ లో అనూహ్య ఓటమితో చతికిలబడ్డ టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టైటిల్ వేటలో అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని తలపోస్తోంది. తొలి మ్యాచ్ లో ఎదురైన ప్రతికూల అంశాలను ఎలాగైనా అధిగమించి తీరాలన్న కసితో నెట్స్ లో చెమటోడ్చింది. అంతేకాక ఆల్ రౌండర్ లోటును పూడ్చుకునేందుకు స్పిన్నర్ హర్భజన్ స్థానంలో స్టువర్ట్ బిన్నిని బరిలోకి దించాలని యోచిస్తోంది. నేటి ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News