: అబూ ఖాసిమ్ కోసం కాశ్మీరులో భారీ వేట!
కాశ్మీరు లోయలో లష్కరే తోయిబాకు ప్రధాన ప్రతినిధిగా ఉన్న అబూ ఖాసిమ్ కోసం భారత భద్రతాదళాలు వేటను ముమ్మరం చేశాయి. పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ పట్టుబడిన అనంతరం, అతను చెప్పిన వివరాలు, వెల్లడించిన రూపురేఖల ఆధారంగా చిత్రాలు తయారు చేయించిన అధికారులు, ఖాసిమ్ కోసం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. 2011 నుంచి ఖాసిమ్ కాశ్మీరు లోయలో తిష్ట వేసి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) వర్గాలు భావిస్తున్నాయి. పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి సహకరించి ఎక్కడ, ఎలా దాడులు జరపాలో చెప్పడం వంటివి ఇతనే చేస్తుంటాడని తెలుస్తోంది. నవేద్ తో పాటు భారత్ లోకి చొరబడిన ఒకాసా, మోహద్ భాయ్ లు ఎక్కడున్నారో కూడా ఖాసిమ్ కు తెలిసే ఉంటుందని ఎన్ఐఏ భావిస్తోంది. సాధ్యమైనంత త్వరలో ఇతన్ని అరెస్ట్ చేయాలని శ్రమిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.