: కేసీఆర్ కు అధికారం ఎలా దక్కిందంటే...:షబ్బీర్ అలీ!
కేసీఆర్ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టడం వెనకున్న సీక్రెట్ ను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా, ఆత్మహత్యలను నివారిస్తా, కరెంటు కోత రానీయను, రైతాంగాన్ని ఆదుకుంటా, ప్రాణహిత - చేవెళ్ల పూర్తి చేస్తా... ఇటువంటివి మొత్తం 180 అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినందునే ఆయనకు అధికారం దగ్గరైందని షబ్బీర్ విమర్శించారు. వికారాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తన ప్రాణమని వ్యాఖ్యానించిన ఆయన, నేడు ఆ ప్రాజెక్టు ప్రాణాలు తీస్తున్నారని దుయ్యబట్టారు. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఆయనకు తెలియడం లేదని, రోజుకో పథకం ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.