: నిన్నటి బాల కార్మికుడు ఇప్పుడు భయపెట్టే 'ఆల్ రౌండర్'గా ఎదిగాడు!


తీవ్రవాదం, అరాచక పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ ఎప్పుడూ అట్టుడుకుతూనే ఉంటుంది. అలాంటి అస్థిర వాతావరణంలోనూ పాక్ క్రికెట్ మనుగడ సాగిస్తూనే ఉందంటే, అందుకు కారణం, ప్రతిభకు కొదవలేని ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉండడమే. వ్యవస్థలే సరిగా లేవు. దాంతో, ఆటగాళ్ల కెరీర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనూ మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటివాడే అన్వర్ అలీ (27). 2013లో పాక్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్న ఈ ఆల్ రౌండర్ ఇటీవల కాలంలో జట్టుకు ఉపయుక్తంగా మారాడు. శ్రీలంకతో ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో అలీ 17 బంతుల్లోనే 46 పరుగులు చేసి అందరినీ ఆకర్షించాడు. ఆ సందర్భంగా ఈ భారీకాయుడు కొట్టిన 4 భారీ సిక్సులు ఇన్నింగ్స్ కు హైలైట్ గా నిలిచాయి. అందులో తన గొప్పదనమేమీ లేదని, అంతా దేవుడి దయ అంటూ అల్లాను ప్రస్తుతిస్తాడు... చాలా సింపుల్ గా. అలీ నేపథ్యంలోకి వెళితే ఎంతో ఆశ్చర్యపోతాం! పాకిస్థాన్ లో ఉగ్రవాదంతో అల్లకల్లోలంగా ఉండే స్వాత్ లోయలోని జకా ఖేల్ ప్రాంతం అతని స్వస్థలం. ఇస్లామిక్ అతివాదుల ప్రాబల్యం ఎప్పుడైతే ఆ ప్రాంతంలో పెరిగిపోయిందో, అలీ కుటుంబం అక్కడి నుంచి కరాచీ తరలివెళ్లింది. అక్కడి పారిశ్రామిక వాడలో నివాసం ఏర్పరచుకున్నారు. కాగా, అలీ చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఇల్లు గడిచేందుకు ఏదో ఒక పని చేయాల్సిందేనన్న సత్యం అలీకి తెలియంది కాదు. అందుకే కరాచీ వెళ్లిన వెంటనే ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. రోజు కూలీగా బతుకీడుస్తున్న అతడి జీవితాన్ని క్రికెట్ మలుపు తిప్పింది. రోజూ ఫ్యాక్టరీకి వచ్చే సమయంలో వీధుల్లో క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్లను చూసేవాడు. చిన్నవాడు కావడంతో తనకూ క్రికెట్ ఆడాలని ఉండేది. నైట్ షిఫ్ట్ వేస్తే, పగలు క్రికెట్ ఆడుకునేందుకు వెసులుబాటు దొరుకుతుందని ఫ్యాక్టరీలో తన బాస్ ను అభ్యర్థించాడు. అతడు అంగీకరించడంతో అలీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అక్కడి నుంచి అలీ వెనుదిరిగి చూసుకున్నది లేదు. స్థానిక కోచ్ అజామ్ ఖాన్ కంట్లో పడ్డాడు. అతడు అలీ ప్రతిభను పసిగట్టి గట్టి తర్ఫీదునిచ్చాడు. అలా లోకల్ టీమ్ లో చోటు సంపాదించడం, ఆపై కరాచీ ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం లభించడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రతిభావంతుడిని ఎవరు వద్దునుకుంటారు చెప్పండి! కొద్దికాలంలోనే అలీ టాలెంట్ నేషనల్ లెవెల్లో మార్మోగిపోయింది. ఆపై పాకిస్థాన్ అండర్-19 జట్టుకు ఎంపికై జూనియర్ వరల్డ్ కప్ లో ఆడాడు. ఇదంతా 2006 నాటి సంగతి. చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ లో అలీ తన స్వింగ్ బౌలింగ్ తో 5 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్ లో తొలుత పాక్ 109 పరుగులు చేయగా, లక్ష్యఛేదనకు దిగిన భారత కుర్రాళ్లను అలీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో హడలెత్తించాడు. అలీ ధాటికి భారత్ 71 పరుగులకే ఆలౌటైంది. ఆనాడు అలీ ధాటికి అవుటైన భారత కుర్రాళ్లలో ఎవరున్నారో చూడండి! రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, రవీందర్ జడేజా... అలీ ధాటికి బ్యాట్లెత్తేసిన వాళ్లే. ఆ తర్వాత పాక్ దేశవాళీ క్రికెట్లో రాటుదేలిన ఈ స్వాత్ లోయ చిన్నోడు 2013లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనతో జట్టులో స్థానం సుస్థిరపరుచుకున్నాడు. అలీ బౌలింగ్, బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని కోచ్ వకార్ యూనిస్ కితాబిచ్చాడు. కఠోర శ్రమ కొనసాగిస్తే తమ ప్రధాన ఆల్ రౌండర్ అతడేననడంలో ఎలాంటి సందేహం లేదని వకార్ అంతటి వాడన్నాడంటే... అలీ విషయం ఉన్నవాడేనని అర్థమవడంలేదూ!

  • Loading...

More Telugu News