: మన్మోహన్ కు సమన్లు ఇవ్వాలంటూ కోర్టులో మధుకోడా పిటిషన్
బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీ చేయాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు మాజీ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శి జై శంకర్ తివారీలకు కూడా సమన్లు ఇవ్వాలని కోరారు. పరిశీలించిన కోర్టు పిటిషన్ కాపీని సీబీఐకి ఇచ్చింది. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో నమోదు చేసిన అభియోగాలతో పాటే పిటిషన్ పై వాదనలు వినాలని కోడా న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. యూపీఏ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ బొగ్గు మంత్రిత్వ శాఖను కూడా పర్యవేక్షించారు. కాగా ఇదే కేసులో కోడా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.