: ఇండియాకు రూ. 63 లక్షల కోట్లు కావాలి, మీరెంత తెస్తారు?: అరబ్ ఇన్వెస్టర్లతో మోదీ
ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు అరబ్ ఇన్వెస్టర్లు ముందుకు రావాలని, భారత్ లో పరిశ్రమలు స్థాపించాలని వచ్చే పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ ఉదయం అరబ్ ఇన్వెస్టర్లు, యూఏఈలోని భారత పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ప్రసంగించారు. ఇండియాలో ఇప్పుడు స్థిరమైన, అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. 2022 నాటికి 5 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం తక్షణం లక్ష ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 63 లక్షల కోట్లు) అవసరమని, మీరెంత పెట్టుబడి తెస్తారని ఆయన ప్రశ్నించగా, సమావేశంలో నవ్వులు పూశాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, మూడీస్ వంటి సంస్థలు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ఒకటని గుర్తించాయని, ఇండియా అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. ఇండియా, యూఏఈల మధ్య సగటున ప్రతి 20 నిమిషాలకు ఒక విమానం తిరుగుతుంటే, భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 34 సంవత్సరాలు పట్టిందని మోదీ చమత్కరించారు. ఇండియాలోని 125 కోట్ల మంది ప్రజలను మార్కెట్ గా భావించకుండా, దేశంలోని శ్రామిక బలాన్ని, మౌలిక వసతులు తదితరాలను గమనించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశానికి ఎతిసలాత్ చైర్మన్ ఈసా మహమ్మద్ అల్ సువైదీ, ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మహమ్మద్ అలీ అల్ అబ్బర్, దుబాయ్ హోల్డింగ్స్ వైస్ చైర్మన్ అహ్మద్ బిన్ బియాత్, ఎతిహాద్ ఎయిర్ వేస్ డిప్యూటీ చైర్మన్ హమద్ అల్ షంసీ, ఆర్డర్ చైర్మన్ అబూబకర్ సిద్ధిఖ్ అల్ ఖూరీ, ఎమిరేట్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ సీఈఓ ముబారక్ రషీద్ అల్ మన్సూరీ, దామన్ ఇన్వెస్ట్ మెంట్స్ సీఈఓ షెహాబ్ లతో పాటు, అరబ్ దేశాల్లోని భారత పారిశ్రామికవేత్తలు డాక్టర్ బీఆర్ షెట్టి (ఎన్ఎంసీ హెల్త్ కేర్ ఎండీ), రవీ పిళ్లై (నాజిల్ అల్ అజేరీ కార్పొరేషన్ ఎండీ), పీఎన్సీ మీనన్ (శోభా గ్రూప్ ఎల్ఎల్సీ చైర్మన్), వాసూ షరాఫ్ (రీగల్ ట్రేడర్స్ చైర్మన్) తదితరులు హాజరయ్యారు.