: 15 రోజుల్లో రెండు సార్లు తగ్గిన పెట్రోలు ధర, నెలాఖరులో మరోసారి తగ్గే అవకాశం!
గత శుక్రవారం నాడు పెట్రోలు ధర లీటరుకు రూ. 1.27, డీజిల్ ధర రూ. 1.17 తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం రెండు వారాల వ్యవధిలో 'పెట్రో' ధరలు రెండుసార్లు తగ్గినట్లయింది. అంతకుముందు ఈనెల 1వ తేదీన లీటరు పెట్రోలుపై రూ. 2.43, డీజిల్ పై రూ. 3.60 చొప్పున ధరలు తగ్గాయి. మొత్తం మీద, ఆగస్టు 1 తరువాత, కొంచెం తక్కువగా రూ. 5 వరకూ లీటరు పెట్రోలుపై ప్రజలకు మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా, ఇప్పుడు ఇండియా తగ్గించిన ధరలకు సంబంధించిన ముడి చమురు జూన్ లో కొనుగోలు చేసినది. జూన్ లో కొన్న ఇండియన్ బాస్కెట్ ఆపై జూలై నాటికి భారత్ కు చేరుకోగా, దాన్ని శుద్ధి చేసే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఆగస్టులో విక్రయాలు చేపడతాయి. ఇక జూన్ తరువాత క్రూడాయిల్ ధరలు మరోసారి 50 డాలర్ల దిగువకు చేరిన నేపథ్యంలో సెప్టెంబర్ క్రూడాయిల్ బాస్కెట్ ధర మరింతగా తగ్గింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి బ్యారల్ క్రూడాయిల్ ను భారత్ రూ. 2,780కు కొనుగోలు చేస్తోంది. జూన్ లో బ్యారల్ ధర రూ. 3 వేలకు పైగానే ఉంది. ఈ నేపథ్యంలో మరో విడత క్రూడాయిల్ ధరలు తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో చమురు కంపెనీలు తదుపరి తగ్గింపు విషయమై ప్రకటన వెలువరించనున్నాయి.