: పన్ను వసూళ్లలో దూసుకెళుతున్న ఏపీ... జూలైలో రూ.4,507 కోట్ల వసూలు
పన్ను వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీలో క్రమంగా పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన 14 నెలల్లో సగటున నెలకు రూ.3,500 కోట్ల మేర పన్ను వసూళ్లను రాబట్టిన ఏపీ సర్కారు, గత నెల (జూలై)లో మాత్రం జూలు విదిల్చింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా రూ.4,507 కోట్ల మేర పన్నును వసూలు చేసింది. రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు రాబట్టిన ఏపీ, ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఆధునికీకరణ, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసిన కారణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించగలిగామని ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.