: ద్రావిడ్ కూడా అలాంటివాడే!: అక్తర్
ఆవేశం ఇంటిపేరు అన్నట్టుగా బౌలింగ్ చేసే పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత ఆటగాళ్ల గురించి తానేమనుకుంటున్నాడో వివరించాడు. సచిన్ టెండూల్కర్ కారణంగా తాను స్టార్ ను అయ్యానని చెప్పుకొస్తూ, రాహుల్ ద్రావిడ్ అంటే మాత్రం హడలిపోయేవాడినని తెలిపాడు. "సచిన్ నన్నో స్టార్ ను చేశాడు. అందుకు అతడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సందేహమే లేదు... అతడో గొప్ప బ్యాట్స్ మన్. ఇతరుల కంటే మెరుగ్గా ఆడగలడు. తనదైన రోజున సచిన్ ఓ పీడకలలా పరిణమిస్తాడు. అయితే, అతిపెద్ద పీడకల అంటే ద్రావిడ్ కు బౌలింగ్ చేయడమే. తన బ్యాటింగ్ తో బోరు కొట్టించేవాడు. నన్ను భయపెట్టిన తొలి బ్యాట్స్ మన్ అతడే. ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడంటే చాలు, రెండు సెషన్లకు పైగా ఫీల్డింగ్ చేయక తప్పదని అర్థమైపోయేది. కానీ, అలాంటి ద్రావిడ్ ను నిలువరించగల బౌలర్ వసీం అక్రమ్ ఒక్కడే. ద్రావిడ్ ను కంట్రోల్ చేయగలిగే సత్తా నాకు లేదు. సచిన్ విషయానికొస్తే అతడో ఓ ప్రబల శక్తి. పరుగులు వెల్లువెత్తిస్తాడు. ద్రావిడ్ అలా కాదు, ముందు మానసికంగా చంపుతాడు. ఆపై శారీరకంగా అలసిపోయేట్టు చేస్తాడు. ఓ రకంగా చెప్పుకోవాలంటే బాక్సర్ మహ్మద్ అలీ వంటివాడు. అలీ తన ప్రత్యర్థిని అలసిపోయేట్టు చేసి ఆపై దాడి చేస్తాడు. ద్రావిడ్ కూడా అంతే" అని వివరించాడు.